బీఆర్ఎస్‌కు 12 సీట్లు వస్తే చాలు .. కేసీఆర్ రాజకీయాలను శాసిస్తారు : కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

 


భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం వేములవాడ నియోజకవర్గ బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, కేంద్రపాలిత ప్రాంతం కాకుండా అడ్డుకునే శక్తి బీఆర్ఎస్‌కే వుందన్నారు. 2014లో బడా భాయి మోసం చేసి ఓట్లు దండుకున్నారని.. ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని చెప్పి మోసం చేశారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. 2024లో ఆరు గ్యారంటీలు ఇస్తామని చోటా భాయి మోసం చేశారని దుయ్యబట్టారు. 

గతంలో రహదారుల నిర్మాణం కోసం సెస్ వసూలు చేసిన మోడీ.. ఇప్పుడు టోల్ రుసుమును ఎందుకు వసూలు చేస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. రూ.30 లక్షల కోట్లు వసూలు చేసి.. దానిలోంచి రూ.14.50 కోట్లు అదానీ, అంబానీల రుణాలను మాఫీ చేశారని కేటీఆర్ ఆరోపించారు. కరీంనగర్ లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో పోటీ బీఆర్ఎస్ - బీజేపీ మధ్యేనని ఆయన పేర్కొన్నారు.

ఇక్కడ ప్రవీణ్ రెడ్డి, జీవన్ రెడ్డి కాంగ్రెస్ టికెట్‌ను ఆశించారని .. వారిద్దరిలో ఎవరికి ఇచ్చినా గట్టి పోటీ వుంటుందని, దీని వల్ల వినోద్ కుమార్ గట్టెక్కుతారన్న ఉద్దేశంతో ఊరు పేరు తెలియని వ్యక్తిని నిలబెట్టారని కేటీఆర్ ఆరోపించారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి, బండి సంజయ్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆయన పేర్కొన్నారు. 

తుంటి విరిగినా, కుమార్తె జైళ్లో వున్నా.. నమ్మినవాళ్లు మోసం చేసినా కేసీఆర్ 70 ఏళ్ల వయసులో బస్సు యాత్ర పేరిట జనంలో తిరుగుతున్నారని కేటీఆర్ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 10, 12 ఎంపీ సీట్లు వచ్చినా కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసించడం ఖాయమని.. అది ఏడాది లోపే వస్తుందని తారక రామారావు జోస్యం చెప్పారు. 


Comments